గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌పై విమర్శలు చేసే అర్హత అంబటి నరేష్‌కు లేదని ఆర్ఎఫ్సీఎల్ అలైడ్ యూనియన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ నెలకంటి రాము తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి నరేష్‌పై పలు ఆరోపణలు చేశారు.
కార్మికుల కష్టాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న వ్యక్తి, కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల జీతాలకు సంబంధించిన డబ్బులను వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయించుకొని కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్ నుంచి ప్రతి నెల కార్మికుల వేతనాలను తన ఖాతాలో వేయించుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే సబ్ కాంట్రాక్టర్ ఇప్పిస్తానని చెప్పి రూ.35 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని నెలకంటి రాము ఆరోపించారు. బూడిద లారీలను అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేశాడని, అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యేపై విమర్శలకు దిగుతున్నాడని అన్నారు. కార్మికుల పేరును అడ్డం పెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.
బహిరంగ చర్చకు రావాలి!
అంబటి నరేష్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని నెలకంటి రాము సవాల్ విసిరారు. తన వద్ద ఉన్న ఆధారాలను బహిరంగంగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు తన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్మికుల ప్రయోజనాల పేరుతో వ్యక్తిగత లబ్ధి పొందే ప్రయత్నాలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.








