- రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామంలోని పొలాల వద్దకు నేరుగా వెళ్లిన అదనపు కలెక్టర్, సర్వే పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పరికరాలతో జరుగుతున్న సర్వే విధానాన్ని స్వయంగా పరిశీలించారు.
భూముల హద్దులు, సర్వే నంబర్ల వివరాలను క్షుణ్ణంగా చెక్ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, వారి సమస్యలు, అభ్యంతరాలను స్వయంగా విన్నారు. రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పారదర్శకంగా, కచ్చితంగా సర్వే చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం ఎమ్మార్వో ఇప్ప నరేందర్, ఆర్ ఐ రఘు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.








