జగిత్యాల: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 19 కిలోల గంజాయిని అధికారులు నిబంధనల ప్రకారం దహనం చేశారు.
దహనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.9.50 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనలు, పర్యావరణ కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ ఇన్సినరేషన్ ప్రక్రియ ద్వారా ఈ గంజాయిని ధ్వంసం చేశారు.
ఈ కార్యక్రమంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ అశోక్‌కుమార్ వ్యవహరించగా, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజాన్ని మత్తు రహితంగా మార్చేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ అశోక్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.








