contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరంను మోసం చేస్తే ఊరుకోం – రసమయి బాలకిషన్ సింహ గర్జన

  • డబుల్ రోడ్డు సగంలో ఆపేసి.. రైతును రోడ్డున పడేశారు!
  • 72 కోట్ల పనులు.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో చెత్తబుట్టలోకి!
  • మార్కెట్ యార్డులో ప్రైవేటోళ్ల దోపిడీ.. కరెంటు కోతలతో రైతు ఉసూరు!

 

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
మానకొండూరు నియోజవర్గం ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. గన్నేరువరం మండలంలో పర్యటించిన ఆయన, డబుల్ రోడ్డు, కరెంటు, వడ్ల కొనుగోళ్లపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

డబుల్ రోడ్డు ఎక్కడ? గన్నేరువరం ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

“గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు వేయాలని మేము ప్రాణం పెట్టి కొట్లాడి తెచ్చాం. గుండ్లపల్లి నుంచి పనులు మొదలుపెట్టాం. గునుకుల కొండాపూర్ వరకు వేసి ఆపేశారు. ఆ తర్వాత ఏమైంది? రోడ్డు సగంలోనే ఆగిపోయింది.
గునుకుల కొండాపూర్ నుండి జంగపల్లి వరకు పనులు ప్రారంభమైనప్పటికీ ఆ రోడ్డును
మధ్యలోనే ఆపకుండా రోడ్డు పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం నుండి పొత్తూరు వరకు రోడ్డు లేక ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ప్రతిరోజూ ప్రమాదాలు, ప్రతిరోజూ ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఇదేనా మీ పాలన? సగంలో ఆపేసిన రోడ్డును చూసి చూస్తూ ఊరుకోం. వెంటనే పూర్తి చేయాల్సిందే!” అని గర్జించారు.

బీఆర్ఎస్ ఇచ్చిన 72 కోట్లు.. కాంగ్రెస్ కాలరాసింది!

“అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 72 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును మంజూరు చేసింది. కేసీఆర్ ఆశయం గన్నేరువరం అభివృద్ధి. గుండ్లపల్లి నుండి కొండాపూర్ వరకు పనులు దూసుకుపోయినయ్. అంతలోనే ఎలక్షన్లు వచ్చినయ్, ప్రభుత్వం మారింది. వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది? బీఆర్ఎస్ తెచ్చిన పనులను కక్షతో ఆపేసింది. 72 కోట్ల అభివృద్ధిని చెత్తబుట్టలో పడేసింది. ప్రజల కోసం కాదు, కక్ష కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. అభివృద్ధిని అడ్డుకోవడమే వీళ్లకు పనైపోయింది” అని మండిపడ్డారు.

ఎల్నీనో దెబ్బ.. రైతుకు 24 గంటల కరెంటు కూడా లేదా?

“ఎల్నీనో ప్రభావంతో వర్షాలు లేవు. బోర్లు ఎండిపోయినయ్. పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నయ్. ఇలాంటి సమయంలో రైతుకు అండగా ఉండాల్సింది కరెంటు. కానీ ఈ ప్రభుత్వం కరెంటు కోతలతో రైతు గొంతు కోస్తోంది. రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాలి. అది భిక్ష కాదు, రైతు హక్కు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఇచ్చి రైతును రాజును చేశాం. ఇప్పుడు ఆ కరెంటు కూడా లేక రైతు అల్లాడుతున్నాడు. పంట ఎండిపోతే రైతు బతుకు ఎండిపోయినట్లే. వెంటనే నిరంతర విద్యుత్ ఇవ్వకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతాం” అని హెచ్చరించారు.

మార్కెట్ యార్డులో ప్రైవేటోళ్ల దోపిడీ.. రైతును ఎవరు ఆదుకుంటారు?

“మార్కెట్ యార్డులోకి వచ్చి ప్రైవేటోళ్లు వడ్లు కొనుక్కుపోతుండ్రు. ఇదేం పాలన? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కడ? మద్దతు ధర ఎక్కడ? రైతు పండించిన వడ్లకు గిట్టుబాటు ధర లేక, ప్రైవేటోళ్ల చేతిలో దోపిడీకి గురవుతున్నాడు. కష్టపడి పండించిన రైతు నష్టపోతుంటే, మధ్యవర్తులు లాభపడుతున్నారు. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంటే ఎలా? వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి, ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి. రైతును దోపిడీ నుండి కాపాడాలి” అని డిమాండ్ చేశారు.

పారువెల్ల రైతు చావు.. ప్రభుత్వ హత్యే!

పారువెల్ల రైతు గంగు రాజయ్య ఆత్మహత్యను గుర్తుచేస్తూ రసమయి భావోద్వేగానికి గురయ్యారు. “ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. రైతు బీమా ఉంటే ఆ కుటుంబం రోడ్డున పడేది కాదు. రైతు బీమా ఎత్తేసి, రైతును చంపేశారు. రైతు చావుకు కారణం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే” అని నిప్పులు చెరిగారు.

“గన్నేరువరం ప్రజలను మోసం చేస్తే ఊరుకోం. డబుల్ రోడ్డు పూర్తి చేయాలి, 24 గంటల కరెంటు ఇవ్వాలి, వడ్లు కొనాలి. లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇది హెచ్చరిక కాదు, ప్రజల గర్జన” అని రసమయి స్పష్టం చేశారు.

ఈకార్యక్రమంలో గన్నేరువరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, న్యాత సుధాకర్,గూడెల్లి ఆంజనేయులు,తీగల మోహన్ రెడ్డి,బోయిని బాలయ్య, అటికం రవి, బోయిని కుమార్, పురుషోత్తం కిషన్ గౌడ్, జక్కనపల్లి సత్తయ్య,బూర శ్రీనివాస్, బొడ్డు బాలయ్య, సమ్మెట అనిల్, ఏల శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :