అనంతపురం – యాడికి : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ 109వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కొత్త రాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతిని జాతీయ సమైక్యత దినోత్సవంగా కూడా నిర్వహిస్తారని తెలిపారు. 1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరా గాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించారని, దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకురాలిగా, “ఉక్కు మహిళ”గా గుర్తింపు పొందారని ఆయన పేర్కొన్నారు.
గ్రంథాలయ అధికారి ఎం. మధుసూదన్ మాట్లాడుతూ, జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహణ ప్రధాన ఉద్దేశం దేశ ప్రజల మధ్య ఐక్యత, మత సామరస్యం, సోదరభావం పెంపొందించడమేనని అన్నారు. సమాజంలో పరస్పర గౌరవం, సహన భావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం. మధుసూదన్, ఉపాధ్యాయుడు కొత్త రాయుడు, షమీం, రిజ్వానా, మాధవి, వనజ, మనోరమ, జ్యోతి, నాగవేణితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









