contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకున్న దొంగల ముఠా అరెస్ట్ : ఎస్పీ జగదీష్ అదహళ్లి

నరసరావుపేట : తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్‌జిల్లా దొంగల ముఠాను నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి  కేసు వివరాలను వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటప్పకొండ రోడ్డులో జరిగిన ఇంటి చోరీ కేసు (Cr.No.114/2026) దర్యాప్తులో నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వీరు నరసరావుపేట, దాచేపల్లి, పిడుగురాళ్ల, ముప్పాళ్ల, మార్టూరు, కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

అరెస్టైన నిందితులు తంగేళ్ల వెంకట అశోక్ రాజు అలియాస్ అశోక్ (17), రాజవరపు గోపీచంద్ అలియాస్ గోపీ (22), దాలి మల్లికార్జునరావు (31), కొండపల్లి తిరుపతయ్య అలియాస్ తిరుపతి (34)గా పోలీసులు గుర్తించారు. వీరు దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని, చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ నేరాలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

భారీగా చోరీ సొత్తు స్వాధీనం

నిందితుల వద్ద నుంచి నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి 95 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, అదనంగా 50 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కేసు వివరాలు

కోటప్పకొండ రోడ్డులోని నవయుగ ఫంక్షన్ హాల్ సమీపంలో నివాసం ఉండే చిలంకూరి ఉమాదేవి, ఆమె భర్త ఇద్దరూ టిఫిన్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ కుమారుడిని కలిసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి వారం రోజుల తర్వాత జూలై 4న ఇంటికి తిరిగి రాగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి, 108 గ్రాముల బంగారు ఆభరణాలు, 220 గ్రాముల వెండి వస్తువులు అపహరించినట్లు గుర్తించారు. మొత్తం సుమారు రూ.11.13 లక్షల విలువైన ఆస్తి చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రత్యేక బృందం దర్యాప్తు

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో నరసరావుపేట రెండో పట్టణ సీఐ ఎ. సురేంద్రబాబు, దాచేపల్లి సీఐ షేక్ ఖాజావలి, ఎస్సై సౌందర్ రాజన్, దాచేపల్లి ఎస్సై ఖాసిం వలి మరియు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, నరసరావుపేటలోని చంద్ర షాపింగ్ మాల్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించినట్లు తెలిపారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ప్రత్యేకంగా అభినందించారు. అదనపు ఎస్పీ ఎం. హనుమంతరావు, సీఐ ఎ. సురేంద్రబాబు, సీఐ షేక్ ఖాజావలి, ఎస్సై సౌందర్ రాజన్, ఎస్సై ఖాసిం వలి మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో ఈ కేసు విజయవంతంగా ఛేదించబడిందని ఆయన పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :