గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గన్నేరువరం మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పార్టీ నాయకులు గన్నేరువరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పుల్లెల రాము, బొమ్మాడి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తీవ్ర శ్రమతో పండించిన పంటను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారి నడ్డి విరుస్తోందని విమర్శించారు.
ఇటీవలి తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం తడిసి నష్టపోకుండా అధికారులు వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు తదితర అవసరమైన సౌకర్యాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమమే దేశ సంక్షేమమని, రైతులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉండదని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతుల తరఫున పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మచ్చ సాయికృష్ణ, నాయకులు టేకు అనిల్, పుల్లెల జగన్మోహన్, జీల కుమార్ యాదవ్, ఏలేటి శ్రీకాంత్ రెడ్డి, మునిగంటి లింగయ్య, గడ్డం రమణ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








