contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిల్డర్-బ్యాంకుల కుమ్మక్కు .. ఈఎంఐల కోసం ఒత్తిడి చేయొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఫ్లాట్ల కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు కీలక ఉపశమనం కల్పించింది. బిల్డర్లు, బ్యాంకు అధికారుల మధ్య ఏమైనా కుమ్మక్కు జరిగిందా లేదా అన్న అంశాన్ని ముందుగా పరిశీలించకుండా, రుణ వాయిదాలు (ఈఎంఐలు) చెల్లించాలని కొనుగోలుదారులపై ఒత్తిడి తీసుకురావద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు కమర్షియల్ కోర్టులు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)లకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

దివాలా ప్రక్రియలో ఉన్న రహేజా డెవలపర్స్‌కు చెందిన కృష్ణా హౌసింగ్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు పూర్తికాక ఫ్లాట్లు అందకపోయినా, బ్యాంకులు రుణ రికవరీ చర్యలు ప్రారంభించడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించకుండా, త్రైపాక్షిక ఒప్పందాల నిబంధనలను పాటించకుండా బిల్డర్లకు బ్యాంకులు రుణాలు విడుదల చేశాయా లేదా అనే అంశాన్ని ముందుగా పరిశీలించడం కోర్టుల బాధ్యత అని స్పష్టం చేసింది. కొనుగోలుదారుల వైపు తప్పు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేకుండా, ఈఎంఐల చెల్లింపునకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని పేర్కొంది.

సాధారణంగా త్రైపాక్షిక ఒప్పందాల ప్రకారం నిర్మాణం ఎంత మేర పూర్తయిందో దానికి అనుగుణంగానే బ్యాంకులు బిల్డర్లకు నిధులు విడుదల చేయాలి. అయితే అనేక సందర్భాల్లో నిర్మాణం ప్రారంభం కాకముందే లేదా పురోగతి లేకుండానే భారీ మొత్తాలను విడుదల చేస్తున్నట్లు కోర్టు గుర్తించింది. ఈ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి నిలిచిపోతుండగా, ఒకవైపు ఇంటి అద్దె, మరోవైపు బ్యాంకు ఈఎంఐలు చెల్లిస్తూ కొనుగోలుదారులు తీవ్ర ఆర్థిక భారం మోస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదే తరహాలో బెంగళూరుకు చెందిన మరో కేసులో కూడా సుప్రీంకోర్టు హోమ్ బయ్యర్లకు ఊరటనిచ్చింది. దాదాపు 4,500 మంది కొనుగోలుదారులు 95 శాతం వరకు చెల్లింపులు చేసినప్పటికీ, పదేళ్లుగా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో వారిపై రికవరీ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది.

దేశవ్యాప్తంగా అసంపూర్తి గృహ నిర్మాణ ప్రాజెక్టుల సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, గత ఏడాది సెప్టెంబరులో కూడా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బిల్డర్లు, బ్యాంకుల పాత్రపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజా తీర్పుతో వేలాది మంది హోమ్ బయ్యర్లకు న్యాయపరమైన రక్షణ లభించడంతో పాటు, బ్యాంకులు, బిల్డర్ల బాధ్యతలపై మరింత స్పష్టత వచ్చినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :