contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు .. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, వాహనాలకు నిప్పు

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సమాచారం ప్రకారం, పెద్దారెడ్డి నివాసానికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో పాటు ఇంటి ప్రాంగణంలో పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటి కిటికీల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన సుమారు 10 స్కార్పియో కార్లు, 20 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయని సమాచారం. అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న జనరేటర్‌కు కూడా నిప్పంటించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మరింత నష్టం జరగకుండా నిలువరించగలిగారు.

ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీప గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను పరామర్శించి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఘటన అనంతరం తాడిపత్రి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారెవరు? దాడి వెనుక అసలు కారణాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :