సిద్దిపేట : తెలంగాణ కాంగ్రెస్‌లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరును తప్పుబడుతూ, “వాళ్లకు పిచ్చికుక్కలు కరిచాయా?” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తీసుకెళ్తారని హెచ్చరించారు. గురువారం సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కొందరు నేతల వైఖరిపై స్పందించిన ముఖ్యమంత్రి, ప్రజల ముందు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ, వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం పనితీరును మెచ్చుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. “ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని వ్యక్తిగతంగా చర్చించాలి. మంచి పనులను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. కానీ కొందరు నేతలు దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
తన ప్రసంగంలో ఏ ఎమ్మెల్యే పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఇటీవల ప్రభుత్వ నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యక్తం చేసిన అసంతృప్తి నేపథ్యంలోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదే సభలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్‌రావును ఓడించిన కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుందని ఆరోపించిన ఆయన, ప్రాజెక్టుల అంశంపై కేసీఆర్, హరీశ్‌రావులతో అసెంబ్లీలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరో కీలక హామీని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించే “ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్” పథకాన్ని ప్రారంభించిన ఆయన, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని తెలిపారు. అలాగే 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రతిపక్షంపై విమర్శలు, సంక్షేమ పథకాల ప్రకటనలు ఒకే వేదికపై వినిపించడంతో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది.








