- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ విమర్శలు
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ విమర్శించారు.
శనివారం బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నీకేష్ అధ్యక్షతన మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు దిమాక్ నక్సల్స్ తరహాలో ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టేందుకు ఈ నెల 23న కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మండల కోఆర్డినేటర్ సుగుత్తి జగదీశ్వరచారి, కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శులు బొమ్మాడి సురేందర్ రెడ్డి, పుల్లెల రాము, మండల ఉపాధ్యక్షులు గాలిపెల్లి శంకర్,కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు కర్ర అనూష రెడ్డి, శక్తి కేంద్ర ప్రభారీలు, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








