contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పారిశుధ్య కార్మికులపై దాడులు అరికట్టాలి.. మెదక్‌లో సీఐటీయూ నిరసన

మెదక్, తూప్రాన్ : నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికురాలు రమణమ్మపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం డిమాండ్ చేశారు.

శనివారం తూప్రాన్‌లో మెదక్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాత్రింబవళ్లు, ఎండా వానా, చలినైనా లెక్కచేయకుండా శ్రమించే పారిశుధ్య కార్మికులపై దాడులు జరగడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండలో జరిగిన ఘటనకు సరైన పారిశుధ్య నిర్వహణ మార్గదర్శకాల లేమి కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇంటి మరమ్మతుల వల్ల వచ్చే మట్టి, నిర్మాణ వ్యర్థాలను మున్సిపల్ చెత్త వాహనాల్లో వేయడాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల విధులు కేవలం గృహ వ్యర్థాల సేకరణ వరకే పరిమితమని, ఇతర వ్యర్థాలను కలపడం వల్ల కార్మికులపై అదనపు భారం పడుతోందన్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను ప్రభుత్వం పెంచకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై అధిక పనిభారం పడుతోందని మల్లేశం విమర్శించారు. అంతేకాకుండా వారి శ్రమకు తగిన వేతనాలు కూడా ప్రభుత్వం అందించడం లేదని ఆరోపించారు.

నల్గొండలో పారిశుధ్య కార్మికురాలిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో మెదక్ పట్టణ మున్సిపల్ యూనియన్ నాయకులు రాజశేఖర్, బద్రి, పోచయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :