గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బుధవారం ఉదయం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశమై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించడం వైద్యుల బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండి వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు.
చిన్నపాటి ఆరోగ్య సమస్యలకే రోగులను కరీంనగర్ లేదా హైదరాబాద్కు రెఫర్ చేయకుండా, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోనే అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా వైద్యులు బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.








