మెదక్ జిల్లా – తూప్రాన్ : తూప్రాన్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నూతన న్యాయస్థానం కల సాకారమైంది. తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నూతన కోర్టు అందుబాటులోకి రావడంతో తూప్రాన్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలు మరింత సులభంగా అందనున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలపతి రావు, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో నూతన న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూప్రాన్ ప్రాంత ప్రజలకు ఈ కోర్టు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్లుగా నూతన కోర్టు కోసం ఎదురుచూస్తున్న తమ ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు. ఇకపై చిన్నచిన్న న్యాయపరమైన వ్యవహారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








