గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నుంచి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం వరకు ప్రతి దశలోనూ సమర్థవంతమైన సమన్వయంతో వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి ఈ.వి. రమణబాబు పనితీరుకు అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కూడా తన బాధ్యతల్లో భాగంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రమణబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారు. సభా ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
వేదిక నిర్మాణం, కూర్చునే సదుపాయాలు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనతో పాటు కార్యక్రమ నిర్వహణలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ముగిసింది.
ఇక ఎన్నికల నిర్వహణ సమయంలో కూడా సహాయ ఎన్నికల అధికారిగా రమణబాబు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను సమన్వయం చేస్తూనే ప్రజలకు అందుబాటులో ఉండటం, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం కొనసాగించడం, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించడం ఆయన పనితీరులో ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమయపాలన, సమన్వయానికి ప్రాధాన్యతనిస్తూ ఫ్రెండ్లీ విధానంతో ముందుకు సాగడం అందరి ప్రశంసలు అందుకుంది.
మున్సిపల్ ఎన్నికల విజయవంతమైన నిర్వహణతో పాటు ప్రమాణ స్వీకార సభకు చేసిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు, గిద్దలూరు ఎమ్మెల్యే, నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు రమణబాబును అభినందించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు కూడా ఆయన సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించడం ఒక విషయం అయితే, వాటిని చివరి వరకు సమర్థవంతంగా సమన్వయం చేస్తూ విజయవంతంగా పూర్తి చేయడం మరో విషయం. గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కమిషనర్ ఈ.వి. రమణబాబు ప్రదర్శించిన పరిపాలనా నైపుణ్యం, సమన్వయ సామర్థ్యం ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.








