తిరుపతి : భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు కంకణబద్ధుడై ముందుకు రావాలని దళిత రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవా సమితి నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగం కేవలం పుస్తకాల్లో ఉండే చట్టాల సమాహారం మాత్రమే కాదని, కోట్లాది మంది బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయానికి పునాదిగా నిలిచిందని వారు పేర్కొన్నారు.
77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి దళిత రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ విలువల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రదాత, మహిళా సాధికారతకు మార్గదర్శకుడు, భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
రాజ్యాంగ హక్కులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే అనేక అన్యాయాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకుని వాటి పరిరక్షణ కోసం చైతన్యవంతులుగా మారాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను కేవలం జయంతులు, వర్ధంతులు లేదా ఉత్సవాలకు మాత్రమే పరిమితం చేయకుండా, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవా సమితి గౌరవాధ్యక్షులు దుగ్గాని జయరాం, అధ్యక్షులు అత్తూరు సుబ్రమణ్యం, మాజీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కె. ఆంజనేయులు, మాజీ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రావూరి ప్రసాద్ బాబు, సలహాదారులు వెంకటస్వామి, భవన్ కమిటీ మేనేజ్‌మెంట్ సభ్యులు రామచంద్రన్న పాల్గొన్నారు.
అలాగే కార్యవర్గ సభ్యులు ఎస్. చెంగల్ రాయులు, పి. చెంగల్ రాయులు, పి. గోవిందస్వామి, పి. రాఘవులు, తీపనూరు సుధాకర్, రావూరి సుధాకర్, ఆటో యూనియన్ నాయకులు చిన్న, పవన్, బాబు తదితరులు హాజరై రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.








