contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్‌లో హైఅలర్ట్ .. లష్కరే తోయిబా బెదిరింపులు

  • బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ప్రజలు భయపడొద్దని విజ్ఞప్తి

 

హైదరాబాద్ : ముంబై 26/11 ఉగ్రదాడుల తరహాలో హైదరాబాద్‌లో పేలుళ్లు జరుపుతామని లష్కరే తోయిబా పేరుతో ఇటీవల పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్, టూరిస్ట్ ప్లాజాలో బాంబ్ స్క్వాడ్, జాగిలాల బృందాలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రముఖ హోటళ్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వదిలివేసిన వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్ని పోలీసు విభాగాలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కొద్ది రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ లతీఫ్ భట్‌ను భారత భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో, అందుకు ప్రతీకారంగా హైదరాబాద్‌లో దాడులు చేస్తామని పేర్కొంటూ నవంబర్ 21న పోలీసులకు ఈ-మెయిల్ వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్, టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుని 300 మందిని హతమారుస్తామని ఆ మెయిల్‌లో బెదిరింపులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ బెదిరింపు మెయిల్‌పై వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ మరియు సైబర్ క్రైమ్ విభాగాలతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో నార్వే నుంచి తాత్కాలిక డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఈ సందేశం పంపినట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఈ బెదిరింపు బూటకమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీపీఎన్ నెట్‌వర్క్, ఐపీ అడ్రస్ ఆధారంగా అసలు నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డీతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సామాను, స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను నమోదు చేశారు.

ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నగరంలో భద్రతా చర్యలు మరింత పటిష్ఠంగా కొనసాగుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :