మెదక్ జిల్లా, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం స్వల్ప నిర్లక్ష్యం భారీ ప్రమాదానికి దారితీసే పరిస్థితి నెలకొంది. మాసాయిపేట గ్రామంలోని 7వ వార్డు ఎస్సీ మాదిగ కాలనీలో చిన్నారులు దేవుని దీపంతో ఆడుకుంటుండగా ఇంట్లోని గృహోపకరణాలకు మంటలు అంటుకున్నాయి.
ఇంటి నుంచి ఒక్కసారిగా పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే నీళ్లతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లోని దుప్పట్లు, మంచం, ఇతర గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సకాలంలో స్పందించిన స్థానికుల కారణంగా మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా నిలువరించగలిగారు.
అగ్నిప్రమాదంలో నష్టపోయిన నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణ సాయం అందించి, తాత్కాలిక నివాసంతో పాటు అవసరమైన గృహోపకరణాలు అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.








