గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: పంట దిగుబడి సరిగా రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఓ కౌలు రైతు మృతి చెందిన సంఘటన గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పారువెల్ల గ్రామానికి చెందిన గంగు రాజయ్య (50) తనకున్న మూడెకరాల సొంత భూమితో పాటు మరో 12 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశాడు. పంట సాగు పెట్టుబడులతో పాటు ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేయడం కోసం సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే, ఈ ఏడాది వేసిన పంటల్లో సరైన దిగుబడి రాకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రాజయ్య తన పొలం వద్ద అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య రాజవ్వ, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.









