మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లిన ఓ వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చొరబడి విలువైన ఆభరణాలు, నగదును అపహరించారు.
స్థానికంగా నివసిస్తున్న సంతోష్ రెడ్డి ఆదివారం ఉదయం తన ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతానికి వెళ్లారు. అనంతరం ఈరోజు ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్న ఆయనకు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా కూడా ధ్వంసం చేసి ఉన్నట్లు గుర్తించారు.
బీరువాలో భద్రపరిచిన సుమారు ఐదు తులాల వెండి చైన్, పావు తులం బంగారు ఆభరణం, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై సంతోష్ రెడ్డి తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తూప్రాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ సందర్భంగా తూప్రాన్ పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు. ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే నమ్మకమైన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
అలాగే పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.








