మాచర్ల : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతూ, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ దేశ రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని, ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం అధికారికంగా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, విధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
అనంతరం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస్ కళ్యాణ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా కలిసి న్యాయవాదులకు కోర్టు బ్యాండ్స్ (Coat Bands) అందజేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కే. డేవిడ్ రాజు, ఏజీపీ గంగుల శ్రీనివాసరావు, పఠాన్ మస్తాన్ జానీ, శీలం వెంకటేశ్వర్లు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.








