అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్1బీ వీసా ఎంతో కీలకం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక హెచ్1బీ వీసాల జారీ అంశం అనేక పర్యాయాలు తెరపైకి వచ్చింది. తాజాగా, హెచ్1బీ, ఎల్1 వీసాల జారీ ప్రక్రియకు సంబంధించిన విధానాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఓ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ప్రకారం, అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకే హెచ్1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా అమెరికాలోని నాణ్యమైన విద్యను అభ్యసించిన చురుకైన విద్యార్థులు అమెరికాలోనే అధిక సంఖ్యలో సేవలు అందించేందుకు వీలుపడుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లును అమెరికా చట్ట సభల్లో ప్రవేశపెట్టారు.అంతేకాకుండా, అమెరికన్లకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్1బీ, ఎల్1 వీసాదారులతో భర్తీ చేయడంపై పూర్తిస్తాయి నిషేధం విధించే లక్ష్యంతోనూ ఈ బిల్లు రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఉద్యోగులను దిగుమతి చేసుకుని, పని పూర్తయిన తర్వాత వారిని సొంతదేశాలకు పంపుతున్న ఔట్ సోర్సింగ్ కంపెనీలపైనా ఉక్కుపాదం మోపాలని ఈ బిల్లులోనే మరో కీలక ప్రతిపాదన చేశారు.