మాచర్ల, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజాస్వామ్య ఓటు హక్కును పరిరక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ మాచర్ల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందుకూరి మధు, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందర్రావు సంయుక్తంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి నాయకులు అడ్డదారుల్లో విజయం సాధించారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసిన వారు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్నారు.
అయితే మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగలేదనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నెలకొనాలంటే జరిగిన అన్ని ఘటనలను నిష్పక్షపాతంగా పరిశీలించి, ఎలాంటి అవకతవకలు జరిగినట్లు ఆధారాలతో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు పిలుపునిచ్చారు.








