కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని తాటి, ఈత వనం ధ్వంసం అవుతోందని ఆరోపిస్తూ తెలంగాణ గౌడ సంఘం నాయకులు గురువారం కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని దున్నడంతో పాటు తాటి, ఈత చెట్లను తొలగించడం వల్ల దశాబ్దాలుగా గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ గౌడ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం సుగుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఖాజీపూర్ గౌడ సంఘం నాయకులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాజీపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 216, 132, 133 పరిధిలోని భూములు ఎస్‌ఆర్‌ఎస్‌పీ ముంపు ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూములు. ఈ భూముల్లో సుమారు 80 సంవత్సరాలుగా తాటి, ఈత వనం ఉండగా, తాతలు, తండ్రుల కాలం నుంచి గీత వృత్తినే ఆధారంగా చేసుకుని సుమారు 50 గౌడ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. గతంలో ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఈ చెట్లకు నంబరింగ్ కూడా నిర్వహించారని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుతూ, అందులోని తాటి, ఈత చెట్లను తొలగిస్తున్నారని, దీంతో తమ సంప్రదాయ కులవృత్తితో పాటు జీవనాధారం కూడా ప్రమాదంలో పడిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకుని తాటి వనాన్ని పరిరక్షించాలని అధికారులను కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖాజీపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం శ్రీనివాస్‌తో పాటు పంజాల రమేష్, ఔడగోని శ్రీనివాస్, పురుషోత్తం ఆంజనేయులు, పురుషోత్తం ఏసు, పులి శ్రీను, పురుషోత్తం సత్తయ్య, వెంగళ వంశీ, ఔడగోని పరశురాం, వెంగళ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ తమ కులవృత్తిని, జీవనాధారాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గౌడ సంఘం నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.








