contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైరల్ ఫోటో కలకలం .. ఎర్రటి ఆకారంపై పుకార్లు

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం, ఖాసీంపేట, మాదాపూర్, గన్నేరువరం చౌరస్తా పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తోంది. రాత్రి వేళ చీకట్లో ఎర్రటి దుస్తుల్లో ఓ ఆకారం కనిపించిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటో విస్తృతంగా షేర్ అవుతుండటంతో గ్రామాల్లో పుకార్లు వ్యాపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఫోటోలో రాత్రి సమయంలో పొలం వద్ద ఎర్రటి రంగు దుస్తుల్లో ఉన్నట్లుగా కనిపించే ఓ ఆకారం ఉండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు రాత్రి వేళ పొలాలకు వెళ్లేందుకు సైతం జంకుతున్నట్లు చెబుతున్నారు. గ్రామాల్లో ఈ ఫోటోపై రకరకాల ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా నెలకొంది.

అయితే వైరల్ అవుతున్న ఫోటో నిజమైనదేనా, లేక ఎవరైనా కావాలనే సృష్టించిన పుకారేనా, లేదా లైట్ వెలుతురులో తీసిన బ్లర్ ఫోటోనా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి స్పందించారు. ప్రజలు ఎలాంటి నిర్ధారణ లేని వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన సూచించారు. వైరల్ అవుతున్న చిత్రం చీకట్లో లైట్ వెలుతురులో తీసిన బ్లర్ ఫోటోలా కనిపిస్తోందని, భూతాలు లేదా అతీంద్రియ శక్తుల గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

అలాగే ఎవరైనా కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదిలా ఉండగా, వైరల్ అవుతున్న ఫోటోపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానిక గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. అధికారులు కూడా పుకార్లకు దూరంగా ఉండాలని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :