గోదావరిఖని : దీపావళి పండుగ సందడి మొదలైంది. చిన్నారుల కేరింతలు, టపాసుల మోతలు, రంగురంగుల వెలుగులతో వీధులు కళకళలాడాల్సిన వేళ.. ఈసారి బాణసంచా ధరలు సామాన్యుల జేబులకు భారంగా మారాయి. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల్లో టపాసుల ధరలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది రూ.450 నుంచి రూ.500 వరకు లభించిన కొన్ని రకాల బాంబులు, టపాసుల ధరలు ఈసారి రూ.600 నుంచి రూ.800 వరకు చేరాయని వినియోగదారులు చెబుతున్నారు. ధరలు పెరగడమే కాకుండా, గతంతో పోలిస్తే టపాసుల పరిమాణం కూడా తగ్గిందని వారు వాపోతున్నారు. ఎక్కువ ధర చెల్లిస్తున్నప్పటికీ చేతికి వచ్చే బాణసంచా తక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని భావిస్తున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన ధరలు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా పిల్లల సరదా కోసం టపాసులు కొనుగోలు చేయాలంటే బడ్జెట్ను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు చెబుతున్నారు.
ఒకవైపు బాణసంచా ధరల పెరుగుదల, మరోవైపు తగ్గిన పరిమాణం కారణంగా ఈసారి దీపావళి కొనుగోళ్లు భారంగా మారాయని వినియోగదారులు అంటున్నారు. వెలుగుల పండుగలో ఆనందం కంటే ఖర్చుల ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు.








