contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అధికారుల స్పందనపై హర్షం

కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై పౌర సంక్షేమ సంఘం సమర్పించిన వినతిపత్రంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు వెల్లడించారు. డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి విచారణకు సంబంధించిన స్పందన రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ నెల 7వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిన వినతిపత్రంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ, డివిజన్ల ఏర్పాటు, గ్రామాల విలీనం, ఓటర్ల జాబితా తదితర అంశాలపై పౌర సంక్షేమ సంఘం పలు అభ్యంతరాలను ప్రస్తావించింది.

ప్రధానంగా 42, 48 డివిజన్లకు సంబంధించిన కేసులు డిస్మిస్ అయినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నారని సంఘం ఆరోపించింది. 66 డివిజన్ల ఏర్పాటు కోసం 21 రోజుల సమయం తీసుకోవాల్సి ఉండగా, ఒక్క రోజులోనే ప్రక్రియ పూర్తి చేసినట్లు వినతిపత్రంలో పేర్కొంది. అలాగే ఓటర్ల జాబితా ఆధారంగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల జనాభా గణనను తక్కువ వ్యవధిలో నిర్వహించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఆరు గ్రామాలను కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రక్రియపై కోర్టు వ్యాజ్యాలు పరిష్కారం కాకుండానే ముందుకు వెళ్లడం వల్ల ఆయా గ్రామాల ప్రజలకు పంచాయతీ, మున్సిపల్ వ్యవస్థల్లో ఓటు హక్కు, ప్రజాప్రాతినిధ్యానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సంఘం తన లేఖలో వివరించింది.

గత 15 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సుమారు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. మొత్తం 68 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రిని కోరింది.

ఈ వినతిపై డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు స్పందిస్తూ, విచారణకు సంబంధించిన అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపినట్లు రమణరాజు వెల్లడించారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, పరిష్కార స్థితి, పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి అవసరమైతే ఫోన్ ద్వారా కూడా కార్యాలయం నుంచి వివరణ అందిస్తామని సచివాలయ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.

తాము లేవనెత్తిన ప్రజా సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల దూసర్లపూడి రమణరాజు సంతోషం వ్యక్తం చేశారు. కాకినాడ ప్రజలకు ఎన్నికల ప్రక్రియలో న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :