పల్నాడు జిల్లా దుర్గి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిని స్కూల్ బస్సు ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు విజయవాడలో చికిత్స పొందుతుండగా, అతని పరిస్థితి కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, దుర్గి మండలంలోని మంగాపురం తండా గ్రామానికి బుధవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో అయ్యప్ప విద్యానికేతన్ పాఠశాలకు చెందిన ఏపీ 30 టీఏ 2917 నంబర్ గల స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన వాంకడావత్ వాగ్యానాయక్, వెంకట అనురాధాబాయి దంపతుల రెండేళ్ల కుమారుడు లిఖిత్ కుమార్ నాయక్ ఇంటి ముందు ఆడుకుంటుండగా, డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో చిన్నారిని ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ప్రమాదంలో బాలుడికి కుడి కాలు, కుడి చేయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రైన్బో ఆసుపత్రికి తరలించారు. బాలుడి కుడి చేయిని తొలగించాల్సి రావచ్చని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.
ఈ ఘటనపై బాలుడి బాబాయి వెంకటేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో నొప్పితో చిన్నారి విలవిల్లాడుతుండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ రెండేళ్ల కుమారుడు పడుతున్న వేదనను తట్టుకోలేక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. స్థానికులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ బస్సుల నిర్వహణలో మరింత జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.








