contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మానవత్వానికి నిదర్శనం.. దివ్యాంగ యువకుడికి అండగా నిలిచిన స్థానికుడు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పుట్టుకతోనే వినికిడి లోపం, మాటలు రాకపోవడం, నడవలేని పరిస్థితితో తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న ఓ యువకుడికి వైద్య సహాయం అందించి అండగా నిలిచారు ఓ స్థానికుడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం నందిగాం గ్రామానికి చెందిన 17 ఏళ్ల సిడాం అభిరామ్‌కు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చయ్య, ప్రమీల దంపతుల రెండో కుమారుడైన అభిరామ్ పుట్టుకతోనే పలు వైకల్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతడి దీనస్థితిని గుర్తించిన అదే గ్రామానికి చెందిన ఆలం బానయ్య మానవతా దృక్పథంతో స్పందించి, అభిరామ్‌ను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో వైద్యులు అభిరామ్‌కు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అతడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అతడికి జీవితకాల దివ్యాంగత్వ ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. ఇకపై ఈ ధ్రువీకరణ పత్రాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

వైద్య సేవలు అందించిన ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి అభిరామ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అభిరామ్‌కు వెంటనే దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయడంతో పాటు, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, అవసరమైన సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అభిరామ్ లాంటి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహకారం అందితే వారి జీవితాల్లో మార్పు వస్తుందని స్థానికులు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :