పెద్దపల్లి జిల్లా: రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటినరీ కాలనీలో నిర్వహిస్తున్న అక్రమ పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్, రామగిరి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఎస్ఐ దీకొండ రమేష్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి చేపట్టారు.
దాడి సమయంలో పేకాట ఆడుతున్న నిందితుల నుంచి రూ.18,650 నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో సెంటినరీ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగులు మట్టా ప్రశాంత్ (40), దొంతరవేణి సదానందం (37), బేగంపేట ఎక్స్రోడ్డుకు చెందిన ఎస్.కె. చాంద్ పాషా (30), పూర్ట కార్తీక్ (30) ఉన్నారు.
ఇదే కేసులో బేగంపేట ఎక్స్రోడ్డుకు చెందిన మైలారపు అనిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల కోసం రామగిరి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం, అక్రమ పేకాట స్థావరాలు నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.









