ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్వహించారని, నామినేషన్ల దశ నుంచి కౌంటింగ్ వరకు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
ప్రకాశంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “ఎన్నికలు ఎలా నిర్వహించకూడదో ఈ ప్రభుత్వం ఆ విధంగానే నిర్వహించి చూపించింది. ఎన్ని అడ్డదారులు, అక్రమాలు చేయవచ్చో ఈ ఎన్నికల్లో అధికార కూటమి చేసి చూపించింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పోలింగ్ సమయంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. చివరకు కౌంటింగ్‌లో కూడా అక్రమాలు చేసి, మా పార్టీ గెలిచిన స్థానాలను తమ ఖాతాలో ప్రకటించుకున్నారు” అని విమర్శించారు.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గెలిచిన ఐదు కార్పొరేటర్ స్థానాలను కూడా కూటమి అభ్యర్థుల విజయాలుగా ప్రకటించారని చెవిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నో నీచమైన చర్యలకు పాల్పడిందని, ఇలాంటి సంప్రదాయాలు కొనసాగితే భవిష్యత్‌లో ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, అన్ని రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెనుకడుగు వేయలేదని ఆయన అన్నారు. “పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. వెన్నుపోటుతో పుట్టిన పార్టీ టీడీపీ” అంటూ రాజకీయ విమర్శలు గుప్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై న్యాయపోరాటం చేయనున్నట్లు చెవిరెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రైవేట్ కేసులు కూడా దాఖలు చేయనున్నామని తెలిపారు.
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, వారికి పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.








