రాబోయే రబీ 2026-27 సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు కలెక్టర్లను ఆదేశించారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగును తగ్గించి, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్యం వంటి ప్రత్యామ్నాయ విధానాలను ప్రోత్సహించాలని సూచించారు.
శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, VBGRAMG పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ పలు అంశాలను సమీక్షించారు. మెదక్ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ నగేష్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ, ఖరీఫ్ పంటల ఉత్పాదకత పెంపు, రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న పథకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం జరగకుండా చూడాలి
ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించినప్పటికీ కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకుండా చూడాలని, అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రైతుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేసి, కొనుగోలు ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి
విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం ద్వారా హాజరును పర్యవేక్షించి, విద్యార్థుల హాజరు కనీసం 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉపాధ్యాయుల హాజరు మెరుగ్గా ఉంటే విద్యార్థుల హాజరు కూడా పెరుగుతుందని, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగవుతాయని తెలిపారు. ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ లెర్నింగ్ వేదికలను విద్యార్థుల అభ్యసనానికి ఉపయోగించాలని సూచించారు.
విద్యా మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలి
రూసా 2.0, పీఎం ఉషా పథకాల కింద మంజూరైన 41 పనుల్లో ఇప్పటివరకు 8 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 33 పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల పనులను వేగవంతం చేయాలని, అలాగే రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ప్రాధాన్యత
సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండకూడదని సీఎస్ స్పష్టం చేశారు. అవసరమైన నిధులు అందుబాటులో ఉంచామని, నిర్ణీత గడువులోగా భూసేకరణ పూర్తి చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు
గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత
VBGRAMG పథకం కింద గ్రామాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సీఎస్ తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాలువల శుభ్రత పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి జో.జి, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, డీఈఓ రాజు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.








