contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రంథాలయ సంస్థలను తక్షణమే వికేంద్రీకరించాలి

కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, కొత్త జిల్లాలకు ప్రత్యేక జిల్లా గ్రంథాలయ సంస్థలను ఏర్పాటు చేయకపోవడం వల్ల గ్రంథాలయాల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాకినాడ, తూర్పుగోదావరి (రాజమండ్రి), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు వెంటనే ప్రత్యేక గ్రంథాలయ సంస్థలను ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

పాత 13 ఉమ్మడి జిల్లాల వ్యవస్థనే ఇప్పటికీ కొనసాగించడం వల్ల నిధుల కేటాయింపు, గ్రంథాలయాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యవేక్షణ వంటి అంశాలు పూర్తిగా కుంటుపడుతున్నాయని సంఘం పేర్కొంది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్–1960లో అవసరమైన సవరణలు చేసి, క్యాడర్ విభజనతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాల్సి ఉన్నప్పటికీ, అది ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించింది.

స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయ సంస్థలకు రావాల్సిన లైబ్రరీ సెస్ బకాయిలు భారీగా పేరుకుపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని పౌర సంక్షేమ సంఘం తెలిపింది. ప్రజలు చెల్లించే ఆస్తి పన్నులో ప్రతి రూపాయికి 8 పైసల చొప్పున వసూలు చేసే లైబ్రరీ సెస్‌ను స్థానిక సంస్థలు గ్రంథాలయ సంస్థలకు జమ చేయకుండా కోట్ల రూపాయల మేర బకాయిలు ఉంచుతున్నాయని ఆరోపించింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్ల మేర లైబ్రరీ సెస్ బకాయిలు పేరుకుపోయాయని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ, రాజమండ్రి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి మాత్రమే రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు సెస్ నిధులు రావాల్సి ఉందని వెల్లడించింది.

2007–08లో అమల్లోకి వచ్చిన ఏకమొత్తం బదిలీ విధానం కారణంగా ప్రజలు చెల్లించిన లైబ్రరీ సెస్ స్థానిక సంస్థల సాధారణ నిధుల్లో కలిసిపోతోందని, దీంతో ఆ నిధులు ఇతర అవసరాలకు మళ్లించబడుతున్నాయని సంఘం ఆరోపించింది. ఈ పరిస్థితి వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన సిబ్బంది పెన్షన్ బకాయిల రూపంలోనే సుమారు రూ.3.2 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాలకు ప్రత్యేక జిల్లా గ్రంథాలయ సంస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే స్థానిక సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న లైబ్రరీ సెస్ మొత్తాన్ని తక్షణమే సంబంధిత గ్రంథాలయ సంస్థల ఖాతాల్లో జమ చేయాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

అదేవిధంగా, ప్రజలు ఆస్తి పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించే సమయంలో లైబ్రరీ సెస్ నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలోకి జమయ్యేలా ‘స్ప్లిట్ పేమెంట్’ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

ప్రజా గ్రంథాలయాలను నిర్వీర్యం కాకుండా కాపాడేందుకు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ సిబ్బంది పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, గ్రంథాలయాల అభివృద్ధి కోసం మేధావులు, పాఠకులు, విద్యార్థులతో కలిసి ప్రతి గ్రంథాలయ స్థాయిలో పౌర సమీక్షలు నిర్వహించి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :