contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కోరుట్లలో లాడ్జీలపై పోలీసుల మెరుపు దాడులు .. నిర్వాహకులకు కీలక ఆదేశాలు

జగిత్యాల జిల్లా, కోరుట్ల: పట్టణంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంతో పాటు అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కోరుట్ల పోలీసులు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో కొరుట్ల సీఐ కొమ్ము తిరుపతి, ఎస్ఐ జి. శ్యాం రాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు లాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా లాడ్జీల్లో బస చేస్తున్న అతిథుల వివరాలు, గుర్తింపు కార్డులు (ఐడీ ప్రూఫ్‌లు), నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారకుండా నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించడం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలు వెలుగులోకి వస్తే సంబంధిత వ్యక్తులతో పాటు వారికి సహకరించిన వారిపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఐ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పట్టణంలో ఇలాంటి ఆకస్మిక తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పోలీసుల చర్యలను స్థానికులు స్వాగతిస్తూ, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగితే పట్టణంలో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :