contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చంద్రగిరిలో నామినేషన్ల పర్వం .. ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం!

  • కారణాలు చెప్పకుండానే నామినేషన్ల తిరస్కరణ.. దాడులు, విధ్వంసంపై తీవ్ర ఆరోపణలు

 

తిరుపతి – చంద్రగిరి, ప్రత్యేక ప్రతినిధి: చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ల తిరస్కరణలు, అభ్యర్థులపై దాడులు, విధ్వంసకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

నామినేషన్లను తిరస్కరిస్తున్న అధికారులు అందుకు సంబంధించిన స్పష్టమైన కారణాలను వెల్లడించకుండా, ఉద్దేశపూర్వకంగా తిరస్కరించామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం లోపాలను వివరించి, పారదర్శకంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు ఇలా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల పరిశీలనలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ఎన్నికల నిష్పక్షపాతత్వంపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, చంద్రగిరి రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారిపై దాడులు, విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు భద్రత కల్పించాల్సిన సమయంలో భయాందోళనలు సృష్టించే ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు గతంలో అధికారంలో ఉన్నవారు ఏ విధంగా వ్యవహరించారో, ఇప్పుడు తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని బహిరంగంగా సమర్థించుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో జరిగిన తప్పులనే తిరిగి చేయడమే రాజకీయమా? ప్రజలు కోరుకునేది ప్రతీకార రాజకీయాలా? లేక అభివృద్ధి పాలనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చంద్రగిరిలో వినిపిస్తున్నాయి.

గత పాలకులు చేసిన తప్పులే తమకు రాజకీయంగా నష్టం కలిగించి అధికారం కోల్పోయే పరిస్థితిని తెచ్చాయన్న విషయాన్ని ప్రస్తుత పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో వారు చేసినట్లే మేమూ చేస్తామనే ధోరణి ప్రజలకు ఎలాంటి మేలు చేయదు. అదే పోటీని ఇంటి స్థలాల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రజోపయోగ కార్యక్రమాల్లో చూపిస్తే ప్రజల మన్ననలు పొందే అవకాశం ఉంటుంది.

మద్యం విక్రయాల విషయంలోనూ చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విచిత్రమైన పేర్లతో మద్యం బ్రాండ్లను విక్రయించి ప్రజల సొమ్మును దోచుకున్నారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయితే ఇప్పుడు కూడా కొన్ని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని, వీధివీధికీ బెల్ట్ షాపులు విస్తరించి గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గత పాలకుల తప్పులను ఎత్తిచూపి అధికారంలోకి వచ్చినవారు అదే తప్పుల బాటలో నడిస్తే మార్పు ఎక్కడ వచ్చినట్లు? పేర్లు మారినా పాలనా తీరు మారకపోతే ప్రజలకు ఒరిగేదేమిటి? అధికార మార్పిడి అంటే కేవలం పాలకులు మారడమేనా? లేక ప్రజలకు మెరుగైన పాలన అందించడమా?

చంద్రగిరి ప్రజలు కోరుకుంటున్నది రాజకీయ కక్షసాధింపులు కాదు.. పారదర్శకమైన ఎన్నికలు, నిష్పక్షపాతమైన అధికారులు, అక్రమాలకు తావులేని పాలన, అభివృద్ధి మాత్రమే. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన కారణాలను నిబంధనల ప్రకారం స్పష్టంగా వెల్లడించి, దాడులు, విధ్వంసం ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. ప్రజల తీర్పే అంతిమం. గతంలో చేసిన తప్పులనే మళ్లీ చేస్తే చరిత్ర పునరావృతం కాకుండా ఉంటుందా? అన్నదే ఇప్పుడు చంద్రగిరిలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :