చేగుంట–తూప్రాన్ : చేగుంట పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల అగ్నిప్రమాదాల సమయంలో విలువైన సమయం వృథా అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం చేగుంట పట్టణంలో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన ధనలక్ష్మి హార్డ్‌వేర్ దుకాణాన్ని ఎమ్మెల్యే సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత వ్యాపారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేగుంట పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే చేగుంటతో పాటు పరిసర ప్రాంతాల 30 నుంచి 40 గ్రామాలకు అగ్నిమాపక సేవలు సత్వరమే అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఫైర్ స్టేషన్ ఏర్పాటు అంశాన్ని జిల్లా కలెక్టర్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఫైర్ ఇంజన్‌తో పాటు అవసరమైన సిబ్బందిని కూడా మంజూరు చేయించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అలాగే, ఇటీవల అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన ధనలక్ష్మి హార్డ్‌వేర్ యజమానులకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి చేగుంటకు శాశ్వత ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.








