కాకినాడ: స్వామి నగర్‌లోని స్వయంభు భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 35వ త్రినాథ వ్రత మేళా భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని త్రినాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో తొలుత అడిగర్ల వెంకటరమణ–లోవకుమారి దంపతులు దేవుడమ్మ, పుష్పలతో కలిసి కుటుంబ సమేతంగా పసుపు గణపతిని పూజించారు. అనంతరం లక్ష్మీ కలశ ప్రతిష్ఠ నిర్వహించి శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేశారు. త్రినాథ పటానికి ప్రత్తి నూలుతో దండ సమర్పించి, మర్రి కొమ్మలు, మామిడి రెమ్మలు, రెల్లుగడ్డి, ఆకులు, వక్కలు, చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించారు. నూనె దీపాలు వెలిగించి సాంబ్రాణి ధూపంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా త్రినాథ వ్రత కథ సారాంశాన్ని భక్తులకు చదివి వినిపించారు. అనంతరం సహస్రనామ పారాయణం నిర్వహించి, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. వేదమంత్రాలు, భజనలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య వ్రత మేళా ఆధ్యాత్మికంగా సాగింది.
స్వయంభు భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, మాఘమాసంలో తొలి ఆదివారం ప్రతి దంపతులు సనాతన త్రినాథ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉగాది నూతన సంవత్సరంలో శుభారంభం కలుగుతుందని తెలిపారు. ఈ వ్రతం కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, సత్సంకల్పాల సాధనతో పాటు సంపూర్ణ సిద్ధిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా, కాకినాడలోని స్వయంభు పీఠంలో 2027 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నెల రోజుల పాటు త్రినాథ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదు ఆదివారాల్లో భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, చివరి ఆదివారం 108 మంది దంపతులతో సామూహిక త్రినాథ వ్రత మేళా వైభవంగా జరగనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భవాని, సత్యవతి, లక్ష్మీ నాగమణి, సరోజకుమారి, అనంతలక్ష్మి, పద్మావతి, రమణమ్మ, నాగరాజు, నాగమణి, వీర ప్రభాకరరావు, రావు తదితరులు పాల్గొని పూజల్లో భాగస్వాములయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








