కాకినాడ: కార్తీక మాసం సందర్భంగా కాకినాడలోని స్వయంభుభోగి గణపతి పీఠంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పీఠంలో నిర్వహిస్తున్న 19వ కార్తీక మాస ఉపాసన కార్యక్రమాల్లో భాగంగా విభూది శివలింగానికి 108 మారేడు దళాలతో భక్తిశ్రద్ధలతో భరణి దీపారాధన నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణాచల శివారాధనలో భాగంగా సృష్టికి మూలమైన పంచభూతాలకు ప్రతీకగా ఐదు ప్రమిదలలో ప్రత్యేక దీపాలను వెలిగించి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భరణి దీపారాధన అనేది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే ఆధ్యాత్మిక కార్యక్రమమని, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, లోకక్షేమం కోసం సత్సంకల్పంతో ఈ దీపారాధన నిర్వహించినట్లు పీఠం నిర్వాహకులు తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో హాజరై మహాశివునికి సమర్పించిన 108 మారేడు దళాల పూజను, పవిత్ర భరణి దీప దర్శనాన్ని భక్తిపూర్వకంగా వీక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి శివుని ఆశీస్సులు పొందారు.








