contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘించారు: పోలీసులపై పిన్నెల్లి తీవ్ర విమర్శలు

పల్నాడు జిల్లా – మాచర్ల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు నామినేషన్ల విషయంలో పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని, అధికార కూటమి నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించి, నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా స్వయంగా పోలీసులే అడ్డుకున్న పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.

చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన, రాబోయే రోజుల్లో వారు తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు.

పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా వ్యవహరించి, న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :