contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్ కు నీటి కొరత .. పెరుగుతున్న తాగునీటి డిమాండ్

హైదరాబాద్ :  రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం, పెరుగుతున్న జనాభా భవిష్యత్తులో తాగునీటి అవసరాలను మరింత పెంచనున్నాయి. ప్రస్తుతం నగరానికి కేటాయించిన నీటి వనరులను దాదాపు పూర్తిస్థాయిలో వినియోగిస్తున్న నేపథ్యంలో, రానున్న సంవత్సరాల్లో కృష్ణా లేదా గోదావరి నదుల నుంచి అదనపు నీటి కేటాయింపులు తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నగరానికి నిరంతరాయంగా తాగునీరు అందించాలంటే ఇప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఏడాదికి 55.79 టీఎంసీల నికర జలాలు కేటాయించబడ్డాయి. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా నదులతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సింగూరు, కృష్ణా ప్రాజెక్టులు, జంట జలాశయాల కేటాయింపులను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. గోదావరి నుంచి కేటాయించిన నీటిలో ఇంకా సుమారు 20 టీఎంసీల వినియోగం మిగిలి ఉండగా, దానిని అందుబాటులోకి తీసుకురావడానికి గోదావరి రెండో, మూడో దశ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌కు జలమండలి రోజుకు సుమారు 560 ఎంజీడీల తాగునీటిని సరఫరా చేస్తోంది. గోదావరి రెండో, మూడో దశల పనులు పూర్తయిన తర్వాత మరో 301 ఎంజీడీల నీరు అందుబాటులోకి రానుంది. దీంతో ప్రస్తుతం కేటాయించిన నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఈ కేటాయింపులు 2030 వరకు నగర అవసరాలను తీర్చగలవని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే నగర విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో 2035 నాటికి మరో 172 ఎంజీడీల అదనపు నీటి అవసరం ఏర్పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా లేదా గోదావరి నదుల నుంచి అదనపు నీటి కేటాయింపులపై ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

మరోవైపు నగరంలో భూగర్భ జలాల మట్టాలు క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోవడం, సింగూరు జలాలపై పూర్తిస్థాయిలో ఆధారపడే పరిస్థితి లేకపోవడం వంటి అంశాలు ప్రత్యామ్నాయ నీటి వనరుల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి.

హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం, జలమండలి సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2030 తర్వాత పెరగనున్న నీటి డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి అదనపు నికర జలాల కేటాయింపులు, కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి చర్యలు కీలకంగా మారనున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :