మాచర్ల : భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ మాచర్ల నియోజకవర్గ ఇంచార్జ్ మాచర్ల రూబెన్ మాదిగ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రూబెన్ మాదిగ మాట్లాడుతూ, 1949 నవంబర్ 26 భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా దేశానికి దిశా నిర్దేశం జరిగిందని, శతాబ్దాలుగా అంటరానితనం, సామాజిక వివక్షతో అణచివేయబడిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించాయని అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం, సామాజిక న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. మనువాద భావజాలంతో అణగారిన సమాజానికి రాజ్యాంగం స్వేచ్ఛా హక్కులను ప్రసాదించిందని, అంబేద్కర్ కలలు కన్న సమానత్వ సమాజ నిర్మాణం దిశగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించి, సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే ఆదర్శాలను ఆచరణలోకి తీసుకురావాలని రూబెన్ మాదిగ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు బొల్లెద్దుల మరియ మాదిగ, బొల్లెద్దుల జాషువా మాదిగ, కంబాలపల్లి ఏసుబాబు మాదిగ, బొల్లెద్దుల శివ మాదిగ, తీగల శ్రీను, మాచర్ల పవన్ మాదిగ తదితరులు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.








