గోదావరిఖని : రామగుండం రీజియన్ ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-11 ఇంక్లైన్లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు బుచ్చిబాపు గురువారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తనకు సర్ఫేస్ విధులు కేటాయించడం లేదన్న మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం, బుచ్చిబాపు గురువారం ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సెల్ఫ్ వీడియో రికార్డు చేశాడు. అనంతరం గని మేనేజర్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అక్కడున్న కార్మికులు వెంటనే స్పందించి ఆయనను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కార్మిక వర్గాల కథనం ప్రకారం, గతంలో కూడా బుచ్చిబాపు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యూనియన్ నాయకులు అధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కొంతకాలం ఆయనకు సర్ఫేస్ విధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల మళ్లీ అండర్‌గ్రౌండ్‌లో విధులు నిర్వహించాలని అధికారులు సూచించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సహోద్యోగులు చెబుతున్నారు.
సీనియర్ కార్మికుల్లో కొందరు ఆరోగ్య సమస్యల కారణంగా అండర్‌గ్రౌండ్‌లో పనిచేయడం కష్టంగా మారుతోందని, అలాంటి వారికి వైద్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సర్ఫేస్ విధులు కల్పించాల్సిన అవసరం ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో సింగరేణిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికుల విధుల కేటాయింపుపై మరోసారి చర్చ ప్రారంభమైంది. అండర్‌గ్రౌండ్‌లో పనిచేయలేని కార్మికుల పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు, సీనియర్ కార్మికులు అధికారులను కోరుతున్నారు.








