కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ పరిధి విస్తరణ, విలీన గ్రామాల అంశంపై పౌర సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగర విస్తరణ విషయంలో జరిగిన న్యాయపరమైన వివాదాల కారణంగా 17 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి నిధులు వెనక్కి వెళ్లాయని సంఘం ఆరోపించింది.
జవహర్ వివేక్ భవన్లో నిర్వహించిన సమావేశంలో సంఘం కన్వీనర్, సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ.. కాకినాడ నగరంలో విలీనం కావాల్సిన తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల గ్రామాలతో పాటు 42, 48 డివిజన్ల ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
నగర విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. 112 గ్రామాలను విలీనం చేసిన ప్రభుత్వం, గతంలోనే విలీన ప్రక్రియ పూర్తయిన ఆరు గ్రామాలను కాకినాడ నగర పాలక సంస్థలో కలిపేందుకు ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. కార్పొరేషన్, పంచాయతీరాజ్ శాఖల నిర్లక్ష్యం కారణంగా విలీన గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని విమర్శించారు.
42 డివిజన్లను నిబంధనలకు విరుద్ధంగా 50 డివిజన్లుగా మార్చే ప్రయత్నాలను పౌర సంక్షేమ సంఘం హైకోర్టు, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి అడ్డుకుందని రమణరాజు తెలిపారు. అనంతరం 66 డివిజన్ల ఏర్పాటులో కూడా 42, 48 డివిజన్లను పరిగణనలోకి తీసుకోకుండా 2005 నాటి భౌగోళిక పరిధిని ఆధారంగా చేసుకోవడం సరికాదని తాము మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించామని పేర్కొన్నారు.
అక్టోబర్ 13, 14 తేదీల్లో విచారణ అనంతరం హైకోర్టు మిసలేనియస్ పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ, 42, 48 డివిజన్లను కలపకుండా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టడం బాధాకరమని అన్నారు. ఈ అంశంపై హైకోర్టు, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
తాజాగా పెదపాటి సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్లో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా 42, 48 డివిజన్లను కార్పొరేషన్లో కలిపి 2026-31 ఎన్నికలు నిర్వహించాలని కోరడం అభినందనీయమని రమణరాజు అన్నారు.
అదేవిధంగా గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం విలీనమైన తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల గ్రామాలను నగరంలో కలిపి ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికార పార్టీ వర్గాలు వేసిన రిట్ పిటిషన్లను ఎదుర్కొనే బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ సరిగా నిర్వర్తించలేదని ఆరోపించారు.
నగర విస్తరణపై నిర్లక్ష్యం కారణంగానే కాకినాడ మొదటి విడత ఎన్నికలకు దూరమైందని అన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్‌ను రద్దు చేసే అధికారం కోర్టులకు, ప్రభుత్వానికి లేదని, అందువల్ల గత 12 ఏళ్లుగా ఆరు గ్రామాలు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయని తెలిపారు.
నవంబర్ 2న 42, 48 డివిజన్ల ఎన్నికల విధానంపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో, 72 గ్రామాల విలీన అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని 42, 48 డివిజన్లు, ఆరు విలీన గ్రామాలతో కలిపి మొత్తం 68 డివిజన్ల పరిధిలో కాకినాడ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఓటర్ల జాబితా, డివిజన్ల సరిహద్దుల నిర్ణయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని సంఘం ఆరోపించింది. తక్కువ సమయంలో డివిజన్ల సరిహద్దులు ఖరారు చేయడం, కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
కాకినాడకు ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ నగర విస్తరణ అంశంపై తగిన శ్రద్ధ చూపకపోవడం విచారకరమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలను నగర పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో చింతపల్లి అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, పెంకె నూకరాజు, విశ్వేశ్వరరావు, సులేమాన్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








