గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఆన్లైన్ నమోదు ప్రక్రియను రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్లో బుధవారం కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 21వ డివిజన్లోని ప్రతి అర్హ కుటుంబం ఈ పథకం ప్రయోజనాలు పొందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రజలు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు అధికారి కృష్ణ, అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్పీలు సరోజన, రజిత, డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు పథకానికి సంబంధించిన నమోదు విధానం, అవసరమైన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.








