గోదావరిఖని : కార్మికులు, ఉద్యోగులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ – పార్లమెంట్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఓసీపీ-3 కృషి భవన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, కార్మిక ప్రతినిధులు పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీఐటీయూ ఓసీపీ-3 బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని కార్మికులకు కనీస వేతనాన్ని రూ.42 వేలుగా, కనీస పెన్షన్ను రూ.21 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని కోరారు.
స్కీమ్ వర్కర్లను పూర్తి స్థాయి కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, నాన్-పర్మనెంట్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాల ఏర్పాటు, సమ్మె చేసే హక్కులను పరిమితం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. రైతులు పండించే పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆస్తులను పరిరక్షించాలని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విధానాలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో జరిగే ‘చలో ఢిల్లీ – పార్లమెంట్’ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కుంట ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓసీపీ-3 పిట్ కమిటీ సభ్యులు, సీఐటీయూ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








