గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రంలో యువ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆగమన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకల్లో మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి స్వాగతం పలికారు.
చావడి నుంచి బస్టాండ్ వరకు నిర్వహించిన అమ్మవారి శోభాయాత్ర డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతుల మధ్య శోభాయాత్ర సాగడంతో పరిసర ప్రాంతాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలు, డప్పు చప్పుళ్లతో గన్నేరువరం గ్రామం మార్మోగింది. భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఉత్సవ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని యువ శక్తి ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. అమ్మవారి ఆగమన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.








