కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 16వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకానికి సంబంధించిన నమోదు, సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
16వ వార్డు కౌన్సిలర్ కచ్చా కాయల జ్యోతి పర్యవేక్షణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వార్డులోని అర్హులైన నిరుపేద కుటుంబాల వివరాలను సేకరించి, వారికి పథకం వర్తించేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కచ్చా కాయల జ్యోతి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. 16వ వార్డులో ఒక్క అర్హ కుటుంబం కూడా ఈ పథకానికి దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో సర్వే, నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, సర్వే బృందాలకు, అలాగే వార్డు ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని ఆమె సూచించారు.








