contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జీవక స్టీల్ ఫ్యాక్టరీ వద్ద స్థానికుల ఆందోళన .. పరిశ్రమలకు ఎమ్మెల్యే హెచ్చరిక

చేగుంట/తూప్రాన్ : పరిశ్రమల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలపై స్థానికులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో సోమవారం ఆయన ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని రైతులు, గ్రామస్తులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపారు.

జీవక స్టీల్ ఫ్యాక్టరీ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయని ఆరోపిస్తూ అనంతసాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, కొండాపూర్, గొల్లపల్లి, చేగుంట, బోనాల, పులిమామిడి, పొలంపల్లి, చిన్న శివనూర్, కర్ణాల్‌పల్లి, మక్కారాజ్‌పేట, కరీంనగర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులు ఫ్యాక్టరీ ఎదుట వంటావార్పు, రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమలు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని, తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమల నిర్వహణ కారణంగా ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి నాణ్యతపై ప్రజల్లో ఆందోళన ఉందని, ఫ్యాక్టరీ నుంచి తరలిస్తున్న మట్టి, దుమ్ము కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

నీటి నాణ్యతలో మార్పుల వల్ల వ్యవసాయ భూములపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ అంశాలపై కాలుష్య నియంత్రణ శాఖతో పాటు సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని కోరారు. నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే యాజమాన్యానికి సూచించారు. కార్మికులకు భద్రతా పాదరక్షలు, హెల్మెట్లు, రక్షణ దుస్తులు, స్వచ్ఛమైన తాగునీరు, ఈఎస్ఐ, పీఎఫ్, బీమా వంటి అన్ని సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిసర గ్రామాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జీవక స్టీల్ ఫ్యాక్టరీ యజమాని మోహన్ అగర్వాల్ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేతో చర్చించారు. కాలుష్య నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామని, పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

యాజమాన్యం ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా అమలు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. హామీల అమలులో పురోగతి లేకుంటే తిరిగి ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరించారు. అనంతరం యాజమాన్యం ఇచ్చిన హామీలతో ఆందోళనకారులు తాత్కాలికంగా తమ నిరసనను విరమించారు.

ఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చేగుంట మండలంలోని అన్ని పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :