మెదక్ జిల్లా, తూప్రాన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే సహాయం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిపి మొత్తం 108 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి చేసే రక్తదానం అవసరంలో ఉన్న మరో వ్యక్తి ప్రాణాలను కాపాడగలదని తెలిపారు. రక్తదానంపై సమాజంలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగనాథ్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్ఐలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ తిరుమలేష్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








