గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గన్నేరువరం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
బీజేపీ గన్నేరువరం మండల శాఖ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో గన్నేరువరం మండలానికి చోటు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.
తక్కువ వర్షపాతం కారణంగా మండలంలోని రైతులు వ్యవసాయ పనులకు, సాగునీటి లభ్యతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంటల సాగు, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి గన్నేరువరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. అర్హులైన రైతులకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ఇంచార్జి సంపల్లి సంపత్ రావు మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, మండల కార్యదర్శి బూట్ల సంపత్, జగన్మోహన్, సందవేణి ప్రశాంత్, మునిగంటి లింగయ్య, తాళ్లపెల్లి పరశురాం, మునిగంటి సత్తయ్య, గూడెల్లి మల్లేశం, జీల కుమార్ యాదవ్, బోయిని అభిషేక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








